కోయిల పాట బాగుందా కొమ్మలసడి బాగుందా

పల్లవి

[ఆమె] కోయిల పాట బాగుందా కొమ్మలసడి బాగుందా
పున్నమితోట బాగుందా వెన్నెల సిరి బాగుందా ||కోయిల||
అందమైన మల్లె బాల బాగుందా
అల్లి బిల్లి మేఘమాల బాగుందా
చిలకమ్మా చెప్పమ్మా చిరుగాలి చెప్పమ్మా ||కోయిల||

చరణం 1

అప్పుడిప్పుడు గున్నమామి తోటలో
అట్లతద్ది ఊయలూగినట్లుగా
ఇప్పుడెందుకో అర్థరాత్రి వేళలో
గుర్తుకొస్తోంది కొత్త కొత్తగా
నిదురించిన ఎద నదిలో
అల లెగిసిన అలజడిగా
తీపితీపి చేదు ఇదా లేతపూల ఉగాది ఇదా
చిలకమ్మా చెప్పమ్మ చిరుగాలి చెప్పమ్మా ||కోయిల||

చరణం 2

మబ్బు చాటులో వున్న వెన్నెలమ్మకి
బుగ్గచుక్కలాగా వున్న తారక
కొబ్బరాకుతో అల్లుకున్న బొమ్మకి
పెళ్లి చుక్కపెట్టినట్టు వుందిగా
కలలు కనే కన్నులలో
కునుకెరుగని కలవరమా
రేయిలోని పలవరమా హాయిలోని పరవశమా
చిలకమ్మా చెప్పమ్మా చిరుగాలి చెప్పమ్మా
[అతడు] కోయిల పాట బాగుంది కొమ్మల సడి బాగుంది
పున్నమితోట బాగుంది వెన్నెలసిరి బాగుంది
అందమైన మల్లె బాలబాగుంది
అల్లి బిల్లి మేఘమాల బాగుంది
చిలకమ్మా బాగుంది చిరుగాలి బాగుంది ||కోయిల||