వలపువలె తీయగా

పల్లవి

వలపువలె తీయగా వచ్చినావు నిండుగా ||2||
మెరుపువలె తళుకుమని మెరసిపోయేటందుకా ||వలపువలె||

చరణం 1

తడబడు నడకల నడిచినపుడు నీ తత్తరపాటును చూడాలి
తలుపు మూయగనె దారులు వెదకె బిత్తర చూపులు చూడాలి ||2||
అని తలచి తలచి ఈ తరుణంకోసం తపసు చేసినది ఇందులకా ||వలపు వలె||

చరణం 2

మురిపము లొలికే ముద్దుమోమును కురులమబ్బులో దాచుటకా
మిసమిసలాడే నొసట కుంకుమ చిరుచెమటలలో కరగుటకా ||2||
ఎదను తెరచి నీవిన్నినాళ్ళుగా ఎదురు చూచినది ఇందులకా ||వలపువలె||