మీ ప్రేమకోరే చిన్నారులం

పల్లవి

మీ ప్రేమకోరే చిన్నారులం, మీ పడిని ఆడే చందమామలం - 2
గోరుముద్దలెరుగనీ బాల కృష్ణులం
బాధపైకి చెప్పలేని బాల ఏసులం
ఆలోచించండి ఓ అమ్మానాన్న ఏం చెప్పగలం మీకు ఇంతకన్నా ||మీ||

చరణం 1

కమ్మగా మా అమ్మచేతితో ఏ పూట తింటాము ఏడాదిలో
చక్కగా మా నాన్న పక్కగా సరదాగ తిరిగేది ఏ నాటికో
పొద్దున్నే పరుగున వెడతారు రాత్రికి ఎపుడో వస్తారు
మరిమరి అడిగినా కధలు చెప్పరూ మేమేం చెప్పినా మనసుపెట్టరూ
అమ్మ నాన్న తీరు మాకు అర్ధమవ్వదూ, ఏమిచెయ్యాలో మాకు దిక్కుతోచదూ ||ఆలో|| ||మీ||

చరణం 2

పిల్లలం మీ చేతి ప్రమిదలం మీ ప్రేమ చమురుతో వెలుగు దివ్వెలం
పువ్వులం మీ ఇంటి నవ్వులం నీ గుండెపై ఆడు చిన్ని గువ్వలం
కనిపించే మీరే దేవుళ్ళు కనిపించే శివుడూ పార్వతులూ
లోకం బూచికి మా గుండె వణికితే మాకు ధైర్యమిచ్చేది మీలాలింపే
అమ్మనాన్నలిద్దరూ వేరు వేరయీ, అనాధలను చేయకండి పసిపిల్లలనీ ||ఆలో|| ||మీ||