ఏమందొ తొలికోడి ఏమందొ తెలుసా?
ముందరుగొ నీ తోడి వారన్నది
ఏమందొ బడిగంట ఏమందొ తెలుసా?
నూరేళ్ళు సుడిపంట నీదన్నది
ఏమందొ గడియార మేమందొ తెలుసా?
కాలాన్ని పొడియార నీ కన్నది
ఏమందొ రవిబింబ మేమందొ తెలుసా?
ఉపకారిదే సంబరమన్నది
ఏమందొ జాబిల్లి ఏమందొ తెలుసా?
చలువలను వెదజల్లి మను మన్నది
ఏమందొ మైదాన మేమందొ తెలుసా?
పని కాట చందాన చనుమన్నది
ఏమందొ ఎలమావి ఏమందొ తెలుసా?
సహకారమున తావి కనుమన్నది
ఏమందొ పూదోట ఏమందొ తెలుసా?
అమరత్వ మొక పూట చాలన్నది