హంసలన్నీ తెల్లని తెలుపు
కాకులేమో నల్లని నలుపు
వెనుకటి కొక కాకికి హంసకు
పెరిగిపోయి మాటా మాటా
హంస అంది ఈసడింపుగా
మమ్ము ఎందున పోలగలరే
అందమందా?చందమందా
వేగమందా?భొగమందా?
పూసికాసే గొప్ప వనములు
నిండు కొలనులు మాకు నెలవులు
పేడ కుప్పలు పెంటపోగులు
గొడ్ల దొడ్లూ మీకు విడుదులు!
పళ్ళూ మరి తామర తుళ్ళూ
పాలూ తేనే మాకు తిళ్ళు
మీకైతే చచ్చిన ఎలుకలు
కుళ్ళిన మాంసం సంగిళ్ళూ!
కోపం తాపం తోడవగా
బదులు చెప్పె కాకి సూటిగా
ఓసి హంసా మిడిసిపడకే
ఒళ్ళు తెలియక కడకు చెడకే
మీకే శాపం మీ రూపం
మీకే శత్రువు మీ అందం
మీ ఈకల పడకల కోసం
మీ జాతికి పట్టెను నాశం
సంఘ జీవనం మాకు రక్ష
సంఘ సేవయే మాకు దీక్ష
మాజాతికి లేదటే లబ్ది?
తరతరానికి వంశ వృద్ది?
మేము లేని అడవి లేదుగా
మేము లేక ఊరు కాదుగా