శివ పూజకు చిగురించిన సిరిసిరి మువ్వా సిరిసిరి మువ్వా

శివ పూజకు చిగురించిన సిరిసిరి మువ్వా సిరిసిరి మువ్వా
మృదు మంజుల పద మంజరి పూచిన పువ్వా సిరిసిరి మువ్వా
యతి రాజుకు జతి స్వరముల పరిమళ మివ్వా సిరిసిరి మువ్వా
నటనాంజలితో బ్రతుకును తరించనీవా సిరిసిరి మువ్వా
పరుగాపక పయనించవె తలపుల నావా
కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా
ఎదిరించిన సుడిగాలిని జయించినావా
మది కోరిన మధు సీమలు వరించిరావా ||పరుగాపక||

చరణం 1

పడమర పడగలపై మెరిసే తారలకై
రాత్రిని వరించకే సంధ్యా సుందరీ... ||పడమర||
తూరుపు వేదికపై వేకువ నర్తకివై
ధాత్రిని మురిపించే కాంతులు చిందనీ...
నీ కదలిక చైతన్యపు శ్రీకారం కానీ ||2||
నిదురించిన హృదయరవళి ఓంకారం కాని... ||శివపూజకు||

చరణం 2

తనవిల్లే సంకెళ్ళై కదలలేని మొక్కలా
ఆమనికై ఎదురు చూస్తు ఆగిపోకు ఎక్కడా
అవధిలేని అందముంది అవనికి నలు దిక్కులా
ఆనందపు గాలివాలు నడపనీ నిన్నిలా
ప్రతిరోజొక నవదీపిక స్వాగతించగా
వెన్నెల కిన్నెర గానం నీకు తోడుగా ||పరుగాపక||

చరణం 3

చలిత చరణ జనితం నీ సహజ విలాసం
జ్వలిత కిరణ కలితం సౌందర్య వికాసం
నీ అభినయ ఉషోదయం తిలకించిన రవి నయనం
గగన సరసి హృదయంలో...
వికసిత సతదల శోభిత సువర్ణకమలం...