జీవనయానం చేయుదమా

తేనెల తేటల మాటలతో
దేశమాతనే కొలిచెదమా
భావం భాగ్యం కూర్చుకొని ఇక
జీవనయానం చేయుదమా
సాగర మేఖల చుట్టుకొని సుర
గంగ చీరగా మలచుకొలి
గీతాగానం పాదుకొని మన
దేవికి యివ్వాలి హారతులు...||తే||

గంగా జటాధరభావనతో హిమ
శైల రూపమే నిలబడగా
గలగల పారే నదులన్నీ ఒక
బృందగానమే చేస్తుంటే...||తే||

ఎందరో వీరుల త్యాగఫలం మన
నేటి స్వేచ్చకే మూలచలం
వారందరినీ తలచుకొని మన
మానవ వీధిని నిలుపుకొని ...||తే||