జయము జయము తెలుగుతల్లి

జయము జయము తెలుగుతల్లి
ప్రియతమధాత్రీయ తల్లి ||జయము||

అరుణోదయ కిరణోజ్వల
రాగరచిత రంగవల్లి
పసిడి పలుకు - పాలవెల్లి!
లలిత కళా కల్పవల్లీ!||జయము||

కడలిఱేడు - కడుగును నీ
కాళ్ళను కెరటాల నీళ్ళ
కళ్ళకద్దుకొను - నీ తల
గగనము - ఉల్లాసముతో ||జయము||

వంశధార - నాగావళీ
వసంత సౌరభములతో
ధగ ధగ లాడెడు - నీ నును
సిగ - మల్లెల మాలలుగా
గోదావరి పూదండగ
క్రాలును - నీ గళమందున
కృష్ణవేణి - కింకిణీక
మణిమేఖల - మార్‌మ్రోగును
చెన్నడును - స్వర్ణముఖీ
పెన్నలు మంజీరములై ||జయము||

నీలో భారత దేశపు
నాలుగు దిక్కులు కలిసెను!
సమన్వయ సవిత్రి నీవు!
సహన నేత్రి నీవు సదా ||జయము||

ప్రాజ్య మగధ రాజ్యములో
ఉజ్జయినీ గగనములో
నీ విజయ ద్వజ మగిరెను
నీ దుందుభి నినదించెను
జరిపినారు - ఒక్ష్వాకులు
శతసహస్త్ర హలదానము
మా జనయిత్రివి నీవే!
మధిర ధరిత్రివి నీవే!
అక్షయ పాత్రవు నీవే!
అమృత చరిత్రవు నీవే!||జయము||

పుట్టినారు - నీ కడుపున
బోధసత్వ మేధావులు
సారస్వతి - సమరాంగణ
సార్వభౌమ బిరుదాంకులు
దయావీర దానవీర
ధర్మవీర ధన్యాత్ములు||జయము||

వాదాలకు వారధివై
బేధాలకు స్వస్తి చెప్పి
కొత్త పాతలకు - కూరిమి
కూడలివై - వర్థిల్లుము
కవితా రస కళ్యాణీ!
గానామృత మయవాణీ!
సస్యశ్యామల గృహిణీ!
సర్వహితాభిలాషిణీ!||జయము||