శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా

శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా
ఘనశీలవతి సీతకధ వినుడోయమ్మా ||శ్రీరాముని||
చెలువుమీర పంచవటి సీమలో
తమకొలువుసేయ సౌమిత్రి ప్రేమతో
తన కొలువు తీరె రాఘవుడు భామతో ||శ్రీరాముని||

చరణం 1

రాముగనీ ప్రేమగొనే రావణుచెల్లి
ముకు చెవులుగోసె సౌమిత్రి రోసిల్లి
రావణుడా మాటవిని పంతము పూని
మైధిలిని గొనిపోయె మాయలు పన్నీ ||శ్రీరాముని||
రఘుపతిని రవిసుతుని కలిపెను హనుమా
నృపుజేసెను సుగ్రీవుని రామ వచన మహిమ
ప్రతి ఉపకృతి చేయుమని పని చెను కపులా
హనుమంతుడు లంకజేరి వెదకెను నలుదెసలా ||శ్రీరాముని||

చరణం 2

ఆ... నాధా... రఘునాధా... పాహి... పాహి
పాహియని అశోకవనిని శోకించే సీత ||2||
దరికిజని ముద్రికనిడి తెలిపె విభుని వార్త
ఆ జనని శిరోమణి అంచుకొని పావనీ ||2||
లంకకాల్చి రామునికడకేగెను రివు రివ్వుమని ||శ్రీరాముని||

చరణం 3

దశరధ సూనుడు లంకనుడాసి దశకంఠు తలలు కోసి
ఆతని తమ్ముని రాజునుజేసి సీతను తెమ్మని పలికే...
చేరవచ్చు ఇల్లాలిని చూసి శీలపరీక్షను కోరె రఘుపతి
అయోనిజపైనే అనుమానమా!
ధర్మమూర్తి రామచంద్రుని ఇల్లాలికా ఈ పరీక్ష
పతియానతి తలదాలిచి అగ్ని దూకె సీత
హుతవాహుడు చల్లబడి శ్లాఘించెనుమాత
సురలు పొగడ ధరణిజతో పురికి తరలె రఘునేత ||శ్రీరాముని||