చినుకు రాలితే... చిగురు నవ్వదా...

చినుకు రాలితే... చిగురు నవ్వదా
చిలక వాలితే... చెట్టు పాడదా ||చినుకు||

అనుపల్లవి:

ఎవరి మనసు ఎవరికోసం ఎదురు చూచునో
ఏ ఉదయం ఏ గుండెకు వెలుగు చూపునో ||చినుకు||

చరణం 1

నీలిమబ్బు నీడను చూచి నెమలి నాట్యమాడదా
పూలకన్నె వన్నెను చూచి తేనెటీగ పాడదా ||నీలిమబ్బు||
నింగిలోన జాబిలిమామ నీటిలోన కలువభామ
ఎంతదూర తీరమునున్నా ఎందుకంత మనసులు దగ్గర
అదే అదే అనురాగం దాని పేరు అనుబంధం ||ఎవరి|| ||చినుకు||

చరణం 2

కోకిలమ్మ రాగం వింటే కొమ్మకెంత సింగారం
జలపాతం దూకుతు ఉంటే కొండకెంత ఒయ్యారం ||కోకిలమ్మ||
వానజల్లు కిందికి రాగా నేల ఒళ్లు ఒంపులు సాగా
ఎందుకంత తీయని ప్రేమ ఎవరికైన తెలిసేనా
||అదే అదే|| ||ఎవరి|| ||చినుకు||