ఇన్ని రాశుల యునికి యింతి చెలువపు రాశి
కన్నె నీ రాశి కూటమి కలిగిన రాశి
చరణం 1
కలికి బొమవిండ్లుగల కాంతకను ధను రాశి
మెలయ మీనాక్షికిని మీన రాశి
కులుకు కుచకుంభముల కొమ్మకును కుంభరాశి
చెలగు హరి మధ్యకును సింహ రాశి
చరణం 2
చిన్ని మకరాంకపు బయ్యెద చేడెకు మకర రాశి
కన్నె పాయపు సతికి కన్నె రాశి
వన్నె మై పైడి తుల దూగు వనితకు తులా రాశి
తిన్నని వాడి గోళ్ళ సతికి వృశ్చిక రాశి
చరణం 3
ఆముకొను నొరపుల మెరయు సతివకు
వృషభ రాశి
గామిడి గుట్టు మాటలు సతి కర్కాటక రాశి
కోమలపు చిగురు మోవి కోమలికి మేష రాశి
ప్రేమ వేంకట పతి గలసె ప్రియ మిధున రాశి.