అన్నిమంత్రములు ఇందే ఆవహించెను
వెన్నతో నాకు కలిగే వేంకటేశుమంత్రము||
నారదుడు జపియించె నారాయణ మంత్రము
చేరె ప్రహ్లాదుడు నారసింహమంత్రము
కోరి విభీషణుడు చేకొనె రామ మంత్రము
వేరె నాకుంగలిగె వేంకటేశుమంత్రము||
రంగగు వాసుదేవ మంత్రము ధ్రువుడు జపియించె
అంగవించె కృష్ణమంత్రము అర్జునుడు
ముంగిట విష్ణుమంత్రము మొగి శుకుడు పఠించె
వింగడమైనాకు నబ్బె వేంకటేశు మంత్రము||
ఇన్ని మంత్రములకెల్ల ఇందిరానాథుడే గురి
పన్నిన దిదియే పరబ్రహ్మమంత్రము
నన్ను కావగలిగెపో నాకు గురుడియ్యగాను
వెన్నెల వంటిది శ్రీ వేంకటేశుమంత్రము||