కృష్ణ వేణి

బిరబిరా చరచరా ముందునకు సాగేవు

చివరకా మున్నీట మాయమై పోయేవు

పరుగులిక చాలునే ఓ కృష్ణవేణి!

కరుణించవే మమ్ము నిత్యకల్యాణి!

తెలియదటనే నీకు మున్నొక్కనాడు

కలిమిలో పేరొందె మా తెలుగునాడు

తొలగిపోయిన వెనుక ఆ గొప్ప సిరులు,

అలముకొన్నవి తల్లి చీకటుల తెరలు!

పారతంత్ర్యము బాపి మొన్ననే గదవే

స్వాతంత్ర్య భానుండు వెలుగసాగినది!

తన వారి మేలుకై నిన్ననే గదవే

తెనుగన్న వేరుకాపురము పెట్టినది!

ముంగారు పంటలో బంగారు సిరుల

సిగారములు మరల సంతరింపగ

నిలిచినాడు కార్య రంగమున నాభ్రాత

నిరుప మానందన ఈవె! కేలూత!

భీమానదీ తుంగభద్రలం గూడి

భీషణార్భటులతో గట్టులనొరసి

ప్రవహించి జలధిపాలైన దికచాలు

నవజీవనానంద మొసగి మమ్మేలు!