నేను పుట్టిన నేల తల్లికి
నిండుగా కై దండ లిడుదుము
తల్లి గుండెల పరిమళములను
తమ్ము అందరి కందజేతును
భరతమాతను చెరుపు చేసి
దుష్టులను దునుమాడి గెలుతును
దేశమాత సమగ్ర సౌష్టవ
రూపమును కాపాడ నిలుతును
మానవతనీ మంట కలిపే
మత దురంతము నతికరింతును
వర్తమాన చరిత్ర తలపై
గత పిశాచిని తొలగ ద్రోతును
నేలతల్లి తనూజలందరు
అన్నతమ్ముల ఆత్మబంధము
పెనచి ఒకటై సంపదల సృజి
యించు మంచికి పోరెదన్
లేమి నలిగే రేదలను ధన
బలము గల పీడకులు దోచని
సర్వ స్వతంత్ర సమాన ధర్మము
విలసిలగ పోరాడెదన్
శ్రామికుల హాలికుల నొక్కటి
చేసి నూతన జన స్వామ్యము
ఈ పురాతన భరత భూమిని
స్వర్గ తుల్య మొనర్చెదన్