వెన్నెల

నేస్తమొచ్చిందమ్మ నేస్తమొచ్చింది!

నీ నేస్త మొచ్చి వాకిటను నిలిచింది!

జలదాల చెఱసాల కమ్ములను దాటి

చరచరా తరులపై గిరులపై జారి

మనయూరి రామన్న గుడి గోపురాన

కనక కలశాలపై తళతళా మెరిసి

నేస్త మొచ్చిందమ్మ నేస్త మొచ్చింది

నీ నేస్తమొచ్చి వాకిటను నిలిచింది!

వెన్నెలను పేరుగల వెలిగేటి పాప

కన్నులకు విందైన కడు మంచి పాప

తల్లి మనసును బోలు చల్లని పాప

అల్లి తామరవంటి తెల్లని పాప

పొంగువారిన పాల సంద్రమ్ము వోలె

సింగారముల జిలుకు బంగారు పాప

మన పూలతోట పూపొదరిండ్ల క్రింద

తన చిన్న వ్రేళ్ళతో ముద్దులొలు కంగ

వెలుగు చీకట్ల ముగ్గులు వేసి వేసి

అలసి సాయపడంగ నిన్ను రమ్మంది

నేస్త మొచ్చిందమ్మ నేస్త మొచ్చింది

నీ నేస్తమొచ్చి వాకిటను నిలిచింది.