సంక్రాంతి పండక్కి సంబరాలెన్నో;
సందళ్ళు, సరదాలు, సయాట లెన్నో,
సాతాని పాడితే సంక్రాంతి మొదలు;
గంగిరెద్దాడితే పొంగళ్ళు మొదలు.
ముత్యాల ముగ్గులతో ముంగిళ్ళు మెఱయు;
కొలువుండి ఆ నడుమ గొబ్బిళ్ళు మురియు.
బంతి, చేమంతులతో వాకిళ్ళు వెలుగు;
పుట్టింట పడుచులతో నట్టిళ్ళూ వెలుగు.
పాతాళ మందుండి బలిదాత వచ్చు;
పంట కళ్ళము నుండి మహాలక్ష్మి వచ్చు.
బరిమీద పుంజులకు పౌరుషము పెఱుగు;
పంతాలు, పందేలు ప్రజలలో పెఱుగు
బావలూ మరదళ్ళ పరియాచకాలు
వీనులకు విందైన వింత పాకాలు
సంక్రాంతి పండుగదె సౌభాగ్యమంతా;
అపురూపమైన దా అనుభవమ్మంతా.